వెలగట్టలేని కుటుంబ శ్రమతో, సమాన పనికి సమాన వేతనం పొందలేని వేతన బానిసత్వంలో యావత్ మహిళా ప్రపంచం రోజు యుద్ధ వాతావరణంలోనే జీవిస్తున్నారు. అమెరికా, -ఇజ్రాయెల్ సామ్రాజ్యవాద, జియోనిస్టు శక్తులు ఇరాన్ పై దాడి చేసి సృష్టించిన యుద్ధ బీభత్సం మూడో ప్రపంచ యుద్ధ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది.
ప్రతి సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాల్లో ముందుగా బలయ్యేది పసిపిల్లలు, స్త్రీలు మాత్రమే. ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించి ఆ దేశ అధ్యక్షుడు ఖమేనీని దారుణంగా హతమార్చడమే కాకుండా ఒక పాఠశాలపై కురిపించిన బాంబుల వర్షంతో 165 మంది బాలికలు హతమయ్యారు. 2023 అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడికి ప్రతీకారం పేరిట గాజాపై ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 23 నెలల్లోనే 28 వేల మంది మహిళలు మరణించారని యుఎన్ ఉమెన్ నివేదిక స్పష్టం చేసింది.
యూనిసెఫ్ గాజాను పిల్లల పాలిట మృత్యుకేంద్రంగా (నరక కూపంగా) అభివర్ణించింది. 'మిడిల్ ఈస్ట్ఐ' అనే ఇంగ్లాండ్ బేస్డ్ పత్రిక పితృస్వామ్య సమాజంలో యుద్ధానికి బలయ్యేది స్త్రీలే ఎక్కువ అని అభివర్ణించింది. అందుకే 116వ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి 8 సందర్భంగా సామ్రాజ్యవాద అధర్మ యుద్ధానికి నిరసన తెలుపుదాం.
ప్రత్యేకంగా పశ్చిమాసియాలో అమెరికా, -ఇజ్రాయెల్ సృష్టిస్తున్న దారుణ మరణకాండను, విధ్వంసాన్ని నిలిపివేయాలని కోరుతూ ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు, సభలు, -సమావేశాలు జరుపుకుందాం. స్త్రీలు, పిల్లలపై దాడులు ఆపడమే కాకుండా మొత్తం సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాలను నిలిపివేయాలని నినదిద్దాం.
సమాన హక్కుల కోసం..
దాదాపు 120 సంవత్సరాల క్రితమే అమెరికన్ మహిళా కార్మికులు సమాన హక్కుల కోసం, పని గంటల తగ్గింపు కోసం క్రమంగా ఓటు హక్కు కోసం పోరాటబాట పట్టారు. 1910లో డెన్మార్క్ రాజధాని కోపెన్హగ్ అంతర్జాతీయ సోషలిస్టు మహాసభ నాటికే భారత్లోని మహారాష్ట్రలో 'భారత స్త్రీ మండలి' ఏర్పడింది. 1920లో ట్రావెన్కోర్ సంస్థానంలో స్త్రీలకు ఓటు హక్కు కల్పించింది.
ప్రపంచ కార్మిక వర్గానికి ఆశాదీపంగా 1948లోనే కమ్యూనిస్టు ప్రణాళిక వెలువడినకాలంలోనే సావిత్రిబాయి ఫూలే పూణేలో బడుగువర్గాల బాలికలకు పాఠశాల ఏర్పరచడం మహిళా విద్యకు పునాదులేసింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 'ఒక సమాజపు అభివృద్ధిని కొలవాలంటే ఆ సమాజంలోని మహిళాభివృద్ధితో సరి పోల్చాలని' చెప్పారు.
స్త్రీలు, బాల బాలికలను తక్కువ వేతనాలతో దోచుకునే సంప్రదాయం మనం నిత్యం చూస్తున్నదే. భారత రాజ్యాంగం ద్వారా ఎన్ని హక్కులు సంక్రమించినా సమాన పనికి సమాన వేతనం అనేది నేటికీ అందని ద్రాక్షగానే ఉన్నది. పైగా పని స్థలాల్లో లైంగిక వేధింపులు, అకృత్యాలు, అత్యాచారాలు, పోర్న్ సైట్స్ స్త్రీల పాలిట శాపంగా పరిణమించాయి.
అమెరికాలో వెలుగు చూస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్ గగుర్పొడుస్తున్నాయి. ఈ ఫైల్స్లో ట్రంప్ బాగోతాలు కూడా బయటపడుతుండడంతో దాన్ని పక్కదారి పట్టించడానికి శాంతి చర్చల మధ్యనే ఇరాన్ పై దాడికి దిగాడనే వాదనలు కూడా ఉన్నాయి.
యుద్ధం ప్రపంచానికి పెనుభారం
ట్రంప్ అధర్మ యుద్ధం ఒక్క పశ్చిమాసియాకే కాదు, భారత్తో పాటు ప్రపంచానికీ పెనుభారంగా పరిణమిస్తుంది. ప్రభుత్వాలు స్త్రీలకు ఉచిత బస్సు, ఉచిత గ్యాస్, ఉచిత కరెంటు అంటున్నాయి. కానీ అధిక సుంకాలు, అధర్మ యుద్ధాలు సామాన్యుల నెత్తిమీద పిడుగులాగ పడుతూ అధిక ధరల రూపంలో మరింతగా విరుచుకుపడడం ఖాయం. లాభాల వేటలో ప్రపంచాధిపత్యం కోసం చేస్తున్న యుద్ధాలలో ప్రజల ప్రాణాలు ప్రశ్నార్థకమవుతున్నాయి.
అంతర్జాతీయంగా శ్రామిక మహిళల పోరాటాలను 1917 రష్యాలో జరిగిన సోషలిస్టు విప్లవం, 1949లో చైనా నూతన ప్రజాస్వామిక విప్లవాలు మార్చి 8 తేదీని విశ్వ వ్యాప్తం చేశాయి. కానీ దీనిని 1975లో ఆలస్యంగా గుర్తించిన ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా ఏదో ఒక పిలుపునిస్తోంది. 30 ఏళ్ల కింద 189 దేశాలతో జరిగిన బీజింగ్ డిక్లరేషన్ విశ్వవ్యాప్తంగా స్త్రీ-, పురుష సమానత్వ కార్యక్రమానికి నాంది పలికినా మౌలిక మార్పులు నేటికీ సాధించలేకపోయాయి.
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా కీర్తించే మనదేశంలో... పార్లమెంటు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఆమోదించినా అది ఎప్పుడు ఆచరణలోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఐక్యరాజ్యసమితి 2026 మార్చి 8 కోసం ‘రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్’ అంటూ పిలుపునిచ్చింది. ఈ సమాన హక్కుల పిలుపులు వింటూ 1975 నుంచి నేటికి 50 సంవత్సరాలు గడిచిపోయాయి. అది ఎన్ని సార్లు 'గివ్ టు గెయిన్' అని పిలుపులిచ్చినా సంపూర్ణ ఆచరణ రూపం ధరించడం లేదు.
స్త్రీ వెలగట్టలేని శక్తి
స్త్రీలకు ఏ రంగంలో అవకాశాలిచ్చినా తమ ప్రతిభను చాటుతూ సమాజాభివృద్ధికి కృషి చేస్తున్నారు. స్త్రీ వెలగట్టలేని ఒక మహత్తర శక్తి. స్త్రీ శక్తిని గుర్తించి సంక్షేమ పథకాలన్నీ స్త్రీల పేరు మీదనే ఉన్నాయి. అయితే, స్థానిక సంస్థల్లో స్త్రీల రిజర్వుడ్ అధికారాలు దాదాపుగా పురుషుల అధికారాలుగానే అమలవుతున్నాయి. ఈ స్థితిలో ఎక్కడో ఒకచోట స్త్రీలు ముందడుగు వేస్తే అక్కడ భార్యల కొంగు పట్టుకుని తిరుగుతున్నారని విమర్శించే పితృస్వామ్య అహంభావం ప్రగతిశీల శిబిరాలను కూడా వెంటాడుతూనే ఉంది.
స్త్రీలు సమాజ విముక్తిలో పురుషులతో భుజం కలిపి పోరాటడమే కాకుండా, పితృస్వామ్యానికి వ్యతిరేకంగానూ పోరాట జెండా ఎగరేస్తుండాలని మార్చి 8 మనకు గుర్తు చేస్తుంది. ఈ దఫా యావత్ ప్రపంచాన్ని ప్రత్యేకించి స్త్రీలు, -పిల్లల జీవితాలను నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్న అమెరికా, -ఇజ్రాయెల్ దుష్ట కూటమికి వ్యతిరేకంగా పోరాటంగా కదులుదాం.
మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే అణ్వాయుధాలతో ప్రపంచమంతా బూడిదయ్యే ప్రమాదాన్ని పసిగట్టి హెచ్చరించిన ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ మాటలను గుర్తు చేసుకుందాం. విధ్వంసకర యుద్ధాలకు వ్యతిరేకంగా మహిళలమైన మనం పిడికిళ్ళు బిగిద్దాం రండి. నేడు నిర్వహించే అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం వర్ధిల్లాలి.
- అరుణోదయ విమలక్క, ప్రజా గాయని-
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
